Dec 21, 2007

పసి మనసులు...



నేను ఈ మధ్యనే యండమూరి గారి నవలా ఒకటి చదివాను...అందులోంచి ఒక చిన్న కథ మన ఇప్పటి జీవితాలకు సరిపోతుందనిపించి ఇక్కడ ప్రస్తావించ దలచాను.

ఈ ఉరుకుల పరుగుల జీవిత ప్రయాణం లో మనం ఏమీ కోల్పోతున్నామన్న విషయం ఒకసారి నింపాదిగా ఆలోచిస్తే మనది మనకే మనోగత మవుతుంది.

ఇక కథ లోకి వస్తే...

ఒక వ్యాపారి తన కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతూ ఉంటాడు, అతనికి ఒక చిన్ని కూతురు ఉంటుంది. అలా కొంత కాలానికి అతని వ్యాపారం దీవాల తీస్తుంది చాలా కష్టాల్లో కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. ఈ ప్రస్తుత పరిస్థితిని తలుచుకుని చాలా బాద పడుతుంటాడు. ఒక రోజు అతని పుట్టిన రోజు వస్తుంది. ఉదయం నిద్దుర నుంచి లేచేసరికి అతని ఎదురుగా అతని చిన్ని కూతురు ఒక పెద్ద బాక్స్ తో నిలుచుని అప్పుడే లేచిన నాన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ బాక్స్ ని అతని చేతిలో పెడుతుంది, బాక్స్ మంచిగా అలంకరించి ఉంటుంది. ఆది తీసుకుని అతని కూతురీని అమాంతం ఒళ్ళో కూచోపెట్టుకుని బుగ్గపై ఒక ముద్దు కురిపించి ఆ బాక్స్ ఓపెన్ చేస్తాడు కానీ ఆ బాక్స్ ఖాళీగా కనిపిస్తుంది అసలే బాదల్లో ఉన్న అతను ఖాళీ బాక్స్ ని చూసి తన కూతురు తనని ఆట పట్టించటానికి ఇలా చేసి ఉంటుందని భావించి ఆ చిన్ని పాపపై కోపగించుకుంటాడు, దాంతో ఆ పాప ఎక్కి ఎక్కి ఏడుస్తుంది.అలా కొంత సేపటికీ అతను తాను చేసిన దానికి నొచ్చుకుని ఆ పాపతో ఇలా చేయటం తప్పు కదమ్మా, ఇంకెప్పుడూ ఇలా ఖాళీ గా ఉన్న బాక్స్ ని బహుమనంలా ఇవ్వకు అని బుజ్జగించటం ప్రారంభిస్తాడు.అప్పుడు ఆ పాప ఏడుపు ఆపి ఆది ఖాళీ అని ఎవరు చెప్పారు నాన్న అందులో నా ముద్దులు ఉన్నాయి నీకు కనపడలేదా అని అడుగుతుంది.... దాంతో మన వాడికి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి...ఆ పాపను అక్కున చేర్చుకుని బుగ్గపై గట్టిగా ముద్దులు కురిపించి తాను చేసిన దానికి తనను తానే నిందించుకుంటాడు...


ఇది చదివాకైన ... ఈ ఉరుకుల పరుగుల జీవితాన్ని అప్పుడప్పుడు ప్రక్కకు నెట్టి కుటుంబంతో ముఖ్యంగా చిన్న పిల్లలతో ఎక్కువ సమయం గడిపేలా ... వారి బావాలు అర్థం చేసుకునేలా ...వారి మనసుల్లో స్థానం ఇంకొంచం పదిలం చేసుకునేలా మసలు కుంటారని ఆశిస్తున్నాను.

Dec 20, 2007

People's Car

ప్రజల కారు వచ్చేస్తుంధోచ్....

జనవరి 10 న డిల్లీ లో జరిగే వాహనాల ప్రదర్శనలో "టాటా" వారు వారి ప్రజల కారుని ప్రదర్శిస్తున్నారు...దాని ఖరీదు అక్షరాల లక్ష రూపాయలు మాత్రమే....ఆ కారు మనము కొనుగోలు చేయటానికి గాను ఇంకా కొద్ది నెలలు మాత్రమే వేచి చూడాల్సి ఉంటుంది...మీకు దీని కోసం పూర్తి సమాచారం కావాలంటే ఇక్కడ చూడండి.దీని రాకతో ద్విచక్ర వాహనాల పని ఇక గోవిందే అనుకుంటా... అలాగే హైదరాబాదులో మరింత ట్రాఫిక్ జాం...ఆ కారు ఇలా ఉంటుందని ఇంతకు మునుపే ప్రచురించటం జరిగింది...


Dec 7, 2007

Background Songs...


ఆ మధ్య నా బ్లాగులో నా గురుంచి తెలుసుకోవాలంటే అని "ఆనంద్" సినిమా లోని ఒక సన్నివేశాన్ని స్పృశిస్తూ రాసుకోవటం జరిగింది. ఆది ఇలా రాసుకున్నాను...


"ఆనంద్ సినిమాలో, మొదటిసారి హీరో పెళ్ళి చూపులకు వెల్లినప్పుడు, కొంత సేపటికి ఒక చిన్న అబ్బయీ వస్తాడు, అప్పుడు అతనెవరు అని ఆ పెళ్ళి చూపుల్లోని అమ్మాయి అడుగుతుంది అప్పుడు మన హీరో అతను ' సమీర్ ' మా కారు డ్రయివరు కొడుకు అని చెప్పినప్పుడు వెనకాల ఒక వాయిలిన్ బిట్ వినిపిస్తుంది ... అది మన్సులోని బావాలని ఎంతగా పలికిస్తుందో... దాన్ని నిశితంగా పరీక్షించిన వాల్లకే తెలుస్తుంది ... ఇది నా అభిరుచి ...ఇది చాలనుకుంటాను నా గురించి చెప్పుకోడానికి..."


దాన్ని చదివిన ఒక 'అనానీమస్' (పేరు తెలియని) వ్యక్తి "ఆనంద్" ఏమీ గొప్ప సినిమా కాదు, అందులోని సంగీతం అంతకంటే గొప్పదెమి కాదుదాన్ని ఉదాహరణగా తీసుకుని నీ గురించి రాసుకోవటం చాలా హాస్య స్ప్రదంగా ఉందని వ్యాఖ్యానించాడు.. నిన్ననే ప్రసాద్ గారి బ్లాగును సందర్శించాక అలా రాసుకోవటంలో తప్పులేదనిపించింది.

ఇదంతా ఎందుకు రాయాల్సి వచ్చిందంటే అతనెవరో నా మీద వ్యాఖ్యలు రాసినందుకు కాదు కానీ, కొన్ని సినిమాలలో చాలా మంది గమనించని చాలా మంచి అంశాలు అప్పుడప్పుడు జారీ పోతుంటాయి. అలాంటివి కొన్ని ఇక్కడ నేను స్పృశించ దలచాను. ఇక "ఆనంద్" సినిమానే తీసుకుంటే చాలా మందికి Audio CD లో లేని ఒక పాట సినిమాలో ఉందన్న విషయం తెలియదు, ఆది సంగీతం పట్ల మక్కువ, ఆసక్తి ఉన్న కొద్ది మంది మాత్రమే గుర్తించ గలరు. అందులో ఒక పాట మనకు వెనకాల వినపడుతుంది. సన్నివేశం ఏమంటే- అనాధ ఆశ్రమంలో రూప మౌన వ్రతంలో ఉన్నప్పుడు రూపకు ఆనంద్‌కు మధ్య సంభాషణల తర్వాత ఒక పాట వస్తుంది...
ఆది ఇలా సాగుతుంది..

"గుండెకే గాయం చేసి నిండుగా నవ్వేస్తుంది
పుండు పై కారం చల్లి పూవులే పూహిస్తుంది
పాపలా నవ్వేస్తుంది పడుచుల కవ్విస్తుంది
వెన్నెల్ల వెదిస్తుంది వేదించి చంపేస్తుంది..."



ముఖ్యంగా ఇటువంటి Background Songs మనకు "రెహమను" సంగీతం అందించిన సినిమాల్లో అక్కడక్కడ వినిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు "నీ మనసు నాకు తెలుసు" అన్న సినిమాలో ఇలాంటిదే ఒక పాట మనకు వినపడుతుంది, చిన్నదే కావచ్చు కానీ చాలా మెలోడీతో కూడుకుని మనసుకు హత్తుకునేలా ఉంటుంది...
ఆది ఇలా సాగుతుంది.


"ఎచట నుండి వచ్చావో
నన్ను ఏమీ చేసావో
ఇది ఆగేనా... లేక సాగేనా...
బదులివ్వరా ....!"



అలాగే 'సఖి' లో కూడా "మాంగళ్యం తంతునామేన..." అని ఒక పాట ఉంటుంది. ఇది ప్రస్తుతం అందరికి తెలుసనుకో కానీ సినిమావచ్చిన క్రొత్తలో దీని గురుంచి ఎవరిని అడిగిన చాలా మంది గమనించలేదనే చెప్పారు. వీలయితే అటువంటి పాటలను కూడా ఆడియో సిడిలో అందించ మనవి...


అలాంటి ఆణిముత్యాలాంటి సంగీతాన్ని అందిస్తున్న సంగీత దర్శకులకు, దానిని కాపాడు కొస్తున్న కమ్ముల లాంటి దర్శకులకు నా ఈ బ్లాగు ద్వారా అభినందనాలు తెలియ చేసుకోదలచాను...

శంకరాభరణం లో చెప్పినట్టుగా మంచి సంగీతం ఎప్పటికీ అజరాజరమైనదే....
Hats off to the great MUSIC...

Dec 4, 2007

Star of India...

ఈ మధ్య నీకు లాటరీ తగిలింది అని కొన్ని దిగ్గజాలైన కంపనీ (Ex. Microsoft, Apple, ... etc) ల నుంచి ఈ-మేల్ రావటం సాదారణం అయ్యింది.ఆది నిజమేనని నమ్మి మోసపోయిన వాళ్ళు లేకపోలేదు... ఇది తెలిసిన తర్వాత నాకు మా గురువు గారు చెప్పిన ఒక కథ (నిజంగా జరిగింది) గుర్తుకు వచ్చింది. ఆది ఇక్కడ నేను ప్రస్తావించ దలచాను. ఒకవేళ ఇలాంటిది ఏమైన మీకు జరిగుంటే నన్ను తప్పుగా బావించ కూడదని మనవి....

ఇప్పుడైతే 'ఈ-మేల్' లో నీకు బహుమతి/లాటరీ వచ్చిందని పంపుతున్నారు, కానీ దాదాపు గా ఇలాంటిదే కానీ కొంచం ఎక్కువ మొత్తంలో నమ్మే విధంగాఒక సంఘటన ఒకటి జరిగింది .. ఆది తరువాత తెలిసి నవ్వుకున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు...

ఇక కథ లోకి వెళ్తే ...

డిల్లీ నగరంలో "Sta of India" అని ఒక సంస్థ ఉంది. ఆది నేరుగా మా కంపనీ లో మంచి పలుకుబడి ఉన్న ఒక ఉన్నత అదికారి అడ్రెస్ మరియు ఫోన్ నంబర్ సంపాదించి, ఒకానొక రోజు నేరుగా అతనికి ఫోన్ చేసి "Congrats Sir" మీరు ఈ సంవత్సారానికి గాను మొదటి 100 మంది గొప్ప వ్యక్తుల్లో (Star of India) ఒకరిగాగుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆ 100 మంది లో మీ స్థానం 76 అని, వరసగా మొదటి నుంచి "అబ్దుల్ కలాం, అమిత బచ్చన్, సచిన్, ... " అలా మీరు 76 వ స్థానం లో నిలచారు... మిగతా వివరాలు మీకు టపా పంపుతామని చెప్పి ఫోన్ పెట్టేశారు. దాంతో ఆ ఉన్నత అధికారి మొదట సందేహించి తర్వాత ఇదంతా ఉత్తిదె అని కొట్టి పారేసాడు.. కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు చెప్పినట్టు గానే 'టపా' వచ్చింది. అందులో, మిగతా వారితో పాటు మీకు సన్మానం చేయాటానికి ఇంగ్లాండ్ ప్రదాని నిఆహ్వానిస్తున్నామని, ఆ సన్మానం ఎక్కడ, ఎప్పుడు అన్నది త్వరలో మీకు ఫోన్ లో తెలియ పరుస్తామని రాసి ఉంది. దాంతో మన అయ్యా గారికి కొంచంనమ్మకం కుదిరింది. సరే నని తనకు తెలిసిన మరియు దగ్గరైన మిత్రులకు ఈ విషయం చెప్పుకున్నాడు. మిత్రులంతా సంతోశించి అతనిని ఎంతో కొనియాడారు. ఇది మెల్ల మెల్లగా అందరికి తెలిసిపోయింది. కథ ఇక్కడ వరకు బాగానే ఉంది ఇక వాళ్ళు ఫోన్ చేసే శుభదినం ఒక రోజు రానే వచ్చింది.వారు ఫోన్ చేసి ఫలానా రోజు ఫలానా ప్రదేశంలో ఈ కార్యక్రమం నిర్వహించ దలచాము మీరు తప్పక రావాలని, మీరు వచ్చేది రానిది మాకు మూడు రోజుల్లోతెలుపమని చెప్పారు. దాంతో ఈ అధికారి రెండు రోజుల తర్వాత వారికి ఫోన్ చేసి తాను ఏ ట్రైనే లో వస్తుంది ఏ రోజు వస్తుంది తెలిపాడు, దానికి వారు ఫలానాహొటెల్లొ ఫలానా రూము బుక్ చేసి ఉంచుతామని చెప్పారు. ఇది జరిగిన నుంచి ఎవరి నోట విన్న ఇంతని గురించే చర్చ. అలా కొంత కాలం అయింది.

ఆ అధికారి ప్రయాణం చేసే రోజు రానే వచ్చింది, మొదట అనుకున్నాట్టు గానే అతను డిల్లీ చేరుకున్నాడు, వారు ఏర్పాటు చేసిన హొటెల్లొ బస చేశాడు. కార్యక్రమం మొదలైంది, తన లాంటి వాళ్ళు చాలా మంది ఆ ప్రోగ్రామ్ కు హాజరయ్యారు. ఇంతలో ఒక అమ్మాయి వచ్చి అందరినీ ప్రశాంతంగా ఉండమని సబా ప్రారంబించింది.ఇలా చెప్పటం మొదలు పెట్టింది. సభకు నమస్కారాలు, మేము మొదటగా ఇంగ్లండు ప్రధాని ని ఈ సభ కు ముఖ్య అతిదిగా ఆహ్వానించాము కానీ కొన్ని అనివార్యకారణాల వల్ల అతను చివరి నిమిషంలో తాను రాలేనని అందుకు క్షమించమని అడిగారని దాంతో ఏమీ చేయాలో పాలు పోక వెంటనే మన ప్రక్క దేశమైన బంగ్లాదేశ్ మాజీ ప్రదానిని మీకు బహుమతి ప్రదానం చేయటానికి గాను మరియు ఈ సభ కు ముఖ్య అతిదిగా ఆహ్వానించటం జరిగింది. అలా సభ అతని అధ్యక్షాన ప్రారంభమైంది. ఈ ప్రోగ్రామ్ కు మొదటి పది వ్యక్తులు (కలాం, అమితాబ్, సచిన్...) కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదని మెల్లగా తెలిసింది.బహుమతి ప్రదానం జరిగింది. ఇంతలో మన వాడి దగ్గరకు ఒక అమ్మాయి వచ్చి సవినయంగా మేము ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నామని దానినిర్వహణకు గాను తనకు తోచింది సమర్పించాలని, తక్కువలో తక్కవ కనీసం 25,000 రూపాయలు ఇవ్వాలని అడగటంతో మన వాడు మొదట నివ్వెర పోయాడు. తర్వాత అంత మందిలో తన పరువు పోతుందని తలచి మరో దారి లేక 25,000 రూపాయలకు చెక్కు సమర్పించుకుని వచ్చాడు. ఇలా గొప్పకుపోయి క్షవరం చేయించుకుని ఎవ్వరకు చెప్పు కోలేక చాలా రోజులు కుమిలి పోయాడు. తర్వతకొద్ది రోజులకు ఈ వార్త బయటకు పొక్కటం, జనాలువిరగ బడి నవ్వుకోవటం జరిగిందనుకోండి...

ఇదంతా ఎందుకు రాశానంటే ... మనిషి ఆశను ఎంతలా దోచుకోవచ్చో అని చెప్పటానికి ఇది ఒక చిన్న ఉదాహరణ ... ఈ-మేల్ ద్వారా మిర్యాలగూడకు చెందిన శ్రీను అనే వ్యక్తి మోసా పోయాడని నిన్న ఈ-టీవీ2 లో వచ్చిన వార్త చూశాక ఇది జ్ఞాపకం వచ్చి ఇక్కడ రాయటం జరిగింది...

కావున ప్రజాలారా రోజు రోజుకు పెరుగుతున్న ఈ సాంకేతికతను ఎన్ని విధాలుగా ఉపయోగించి జనాలనూ మోసం చేయచ్చో తెలుసుకుని అప్రమత్తంగా ఉండండి....

నిజమైన STAR OF INDIA అవండి....